Tuesday, December 26, 2017

దిగులు దేహాన్నై

ఆరాటం గా అనుకుంటా
ఈ సారన్నా
నన్ను నీ దగ్గర నుండీ
తిరిగి తెచ్చేసుకోవాలని
గడ్డి పూల మధ్య
ఓ సాయంత్రాన్నలా పరిచేసి
కబుర్ల కాగితాలన్నీ
మడత విప్పి చదివేస్తూ
ఆప్త క్షణాలు అద్ది
జీవితం ఖాళీతనాల మీద
సంతోషాన్ని బొమ్మగా గీసేస్తుంటే
వెళ్లాల్సిన సమయమొకటి
వచ్చేసిందని
వదిలీ వదల్లేక
భారంగా నే అనుకో
దిగుళ్ళని దాచేయాలనే తొందర్లో
నవ్వుని నటించడం రాక
బెంగటిల్లుతున్న నీ కళ్ళకి
నవ్వుతూ వాన చినుకుల్ని
తోడిచ్చి పంపాను కానీ
ఈ సారీ ఎప్పటిలా
నన్ను మాత్రం
నీలో మర్చిపోయి
దిగులు దేహాన్నై తిరిగొచ్చేసా


ఈ వర్మకేమైయింది ...

ఈ వర్మకేమైయింది ...

డిషుమ్ డిషుమ్ అంటూ సౌండ్ లతో షర్ట్ నలగని హీరో చేతిలో ఒక్కోడు వచ్చి కొట్టించుకొని వెళ్లి కాలవలో పడ్డం చూసి చూసి ఉన్నా జనాలకు ఫైటింగ్ లు ఇంత అందం గా కూడా తీయొచ్చు అని చూపించిన సినిమా శివ. నేను నాలుగో క్లాస్ లో ఉండగా వచ్చిన ఆ సినిమా అప్పట్లో బాగా నచ్చేసింది ఆ తర్వాత ఎన్ని సార్లు చూశానో . పాపని చేతిలో పట్టుకొని chasing ని తప్పించుకుంటూ సైకిల్ మీద హీరో వెళ్లడం ..వర్షం లో చీకట్లో ఫైటింగ్ , కాలేజీ క్యాంపస్ వెకిలి తనం లేకుండా చూపించడం ఇలా చాలా సన్నివేశాల్లో 'డైరెక్టర్ ' మార్క్ ని మెచ్చుకోకుండా ఉండలేం.

ఇక ఆ తర్వాత వచ్చిన క్షణం క్షణం ఈరోజుకి ఈ సినిమా వస్తే ఇక రిమోట్ పక్కన పడేసి టీవీ కి అతుక్కొని పోతా , అసలు పాటలో హీరోయిన్ కి వంద డ్రెస్ లు మార్చడం అలవాటయిన సినిమాకి . శ్రీదేవి లాంటి అందమైన హీరోయిన్ సగం పైగా సినిమాలో ఒకే డ్రెస్ లో అదీ మట్టి కొట్టుకుపోయిన డ్రెస్ లో అందంగా చూపించడం ఓ ఎత్తు అయితే ..అమాయకంగా హాస్యం పండించే క్యారెక్టర్ లో తన expression నిజంగా ఓ ట్రెండ్ .. ఎక్కడ వెకిలి హాస్యం ఉండదు. క్రైమ్ సస్పెన్స్ హాస్యం మూడు మిక్స్ చేసి తీసిన ఈ మూవీ నా అల్ టైం ఫేవ్ మూవీ . కామెడీ విలన్ గా పరేష్ రావల్ నటన ఎన్ని సార్లు చూసిన కొత్తగా ఉంటుంది. ,. ఆ తర్వాతే వచ్చిన మనీ మనీ .బ్రహ్మానందం కామెడీ ..ఖాన్ దాదా తో గేమ్స్ వద్దు, వారెవ్వా ఏమీ పేస్ అనే సాంగ్ కామెడీ విలన్ మీద తీయడం క్రెడిట్ ఇక్కడా మళ్ళా వర్మ కే


రాత్రి మూవీ లో అందమైన దయ్యం హీరోయిన్ రేవతి రూపం లో నవ్వుతోనే భయపెట్టేస్తుంది. ఇక్కడ కేవలం ఓ నవ్వు ఓ చూపు ఆ వెనకాలే వచ్చి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ . ఓ బొమ్మ కేసి కెమెరా అలా చూపిస్తూ ఉంటే వెనక ఏ మ్యూజిక్ ఉండదు అంతా సైలెంట్ . ఉన్నట్లుండి ఆ బొమ్మ నవ్వుతుంది ఆ వెనుకే ఒక్కసారిగా మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది. ఇక వెన్నులో వణుకే . సినిమాలో భయంకరమైన ముఖాలు లేవు దృశ్యాలు లేవు అయినా భయపెట్టిస్తాడు వర్మ .


కౌన్ అని ఓ హిందీ సినిమా ముగ్గురే ముగ్గురు .ఓ ఇల్లు సినిమా మొత్తం అక్కడే. అయినా రెండు గంటలు పాటు సినిమాని ఆపకుండా చూసేసా. ఆ మూడు క్యారెక్టర్ ల లోనే విలన్ ఎవరు అనే సస్పెన్స్ మైంటైన్ చేయడం నిజంగా హైలైట్ .చివర్లో ఊర్మిళ ఆమ్మో సూపర్ acting అసలు. ఇక్కడ కూడా ప్లేట్ లో ఉన్న బ్రెడ్ ముక్క భయపెట్టేస్తుంది.


మాఫియా బ్యాక్ డ్రాప్ లో వచ్చే సత్య అసలు అంత పెద్ద సినిమాకి చక్రి లాంటి చిన్న హీరో ని సెలెక్ట్ చేసుకోడం అదీ హిందీ పరిశ్రమకి ఏ మాత్రం పరిచయం లేని పేస్. అయినా సినిమా లో అది లోటు అనిపించదు. సత్య ,సర్కార్ .. .ఇండియా లో అంతర్లీనం గా రాజకీయాలను సినీ రంగాలను శాసిస్తోన్న మాఫియా ని తనదైన స్టైల్ లో చూపించాడు. వర్మ మార్క్ మాఫియా.


గాయం ,అంతం ,రంగీలా ,shool ,కంపెనీ, అనగనగా ఒక రోజు గోవిందా గోవిందా ఇలా ఎన్నో మంచి సినిమాలు తీసిన వర్మ కి సినిమాలు తీయడం మర్చిపోయారా లేదా ప్లాప్ తీయాలని కంకణం కట్టుకున్నారో తెలియదు కానీ .మొత్తానికి వర్మ మార్క్ సినిమా ఓ గడిచిపోయిన చరిత్రలా మిగిలిపోయింది.


వివాదాలు , ట్విట్టర్ ల జబ్బు నుండీ వర్మ కోలుకొని మళ్ళీ పాత వర్మలా మారిపోయి హీరోజబ్బు పట్టి పోయిన తెలుగు సినిమా కి మళ్ళీ వైవిధ్య మైన సినిమాలు అందించాలని కోరుకుంటూ


 ..GET WELL SOON. .from twitter disease 

విశ్వనాధ్ గారి గురించి



బాధలో బావి మీద నిలబడి తాగిన మైకం లో వేదాంతం పాడుకుంటూ ఉంటాడు. 

ఇంతలో ఆమె వస్తుంది. అప్పుడే మొదలవుతుంది వాన. ఆ బొట్టు చెరిగిపోతూ ఉంటే నుదిటి మీద చేయి అడ్డం పెడతాడు హీరో .

భర్త పొతే బొట్టు తీయాలన్న సంప్రదాయాన్ని విశ్వనాధ్ గారు సమర్ధించారు అనే కోణం లో చూసి ఈకలు పీకే వారికి ఆ దృశ్యం తప్పుగా కనిపించవచ్చు చూసే కళ్ళను బట్టే. అక్కడ సమర్ధించలేదు విమర్శించలేదు. అక్కడ చూడాల్సింది ఆచారం కాదు తాను చెప్పదల్చుకున్న విషయాన్ని ఎంత సున్నితంగా చూపించారు అన్న విషయాన్నీ

మనసుకి తడి తెలిసిన మనిషికి ఆ దృశ్యం హత్తుకుంటుంది. సినిమా అయిపోయినా ఆ దృశ్యాలు వెంటాడతాయి. చాలా ఏళ్ళ తర్వాత కలుసుకున్నాక తాను సంతోషంగా లేను అని తెలిస్తే భాధ పడతాడని ఆమె బొట్టు పెట్టుకొని రావడం . ఆమె సంతోషం లో తన సంతోషం వెతుక్కునే ప్రేమికుడి పాత్రలో అతను . టీవీ లో సాగర సంగమం సినిమా చూసిన చాలా రోజుల వరకూ ఆ సినిమా వెంటాడింది. ఆ తర్వాత ఎన్ని సార్లు చూశానో లెక్కలేదు.

ప్రేక్షకులకి పరిచయం లేని వయసు మళ్ళిన వ్యక్తి ని హీరో గా పెట్టి , కథానాయకి ని వేశ్య పాత్రలో చూపించి శంకరాభరణం తీసి ప్రేక్షకుల చేత నీరాజనాలు అందుకున్నారు. స్వాతి కిరణం లో అహం ఈర్ష్య తో రగిలిపోయే హీరో పాత్రలో ముమ్ముట్టి , అమాయకుడిగా స్వాతి ముత్యం లో కమల్ హాసన్. చెప్పులు కొట్టుకునే వ్యక్తి పాత్రలో అగ్ర హీరో చిరంజీవి ,సిరి వెన్నెల లో గుడ్డి వాడైనా హీరో, శోభన్ బాబు కున్న అందాల హీరో ఇమేజ్ కి భిన్నంగా నల్లగా అనాకారిగా చెల్లెలి కాపురం లో ఇలా చూపించినా అభిమానులు బ్రహ్మ రధం పట్టారు .

హీరో లకు ఆపాదించే హీరోయిజమ్ వెర్రిగా మారి సమాజం పై యువత పై చెడు ప్రభావం చూపిస్తున్నా నోరెత్తని కుహనా మేధావులు విశ్వనాధ్ గారి సినిమాలు సమాజం పై ఏ దుష్ప్రభావం చూపించాయని విరుచుకుపడుతున్నారు. హీరోయిన్ కి ప్లాస్టిక్ మేకప్ లు ఉండవు. హీరో మగతనాలు ఆకాశం లో నుండీ ఊడిపడేట్టుగా అసహజంగా నూ కూడా ఉండవు. తన చుట్టూ ఉన్న సమాజాన్ని తన సినిమాలో చూపించారు అదీ కళాత్మకంగా
తనని తానూ ఏమీ అభ్యుదయవాదిగా అయన ప్రకటించుకోలేదు సమాజాన్ని తన సినిమాలతో ఉద్దరించేస్తున్న అని చెప్పుకోలేదు. తనకి నచ్చిన కళని కలలుగా కన్నారు ఆ కలల్ని తనకి తెలిసిన సినిమా కళ ద్వారా కళాత్మకం గా తీశారు. హాయిగా సినిమా చూద్దాం అనుకునే సగటు ప్రేక్షకుడిని కట్టి పడేసే సినిమాలు తీశారు. అలాగని అవేమీ నేల విడిచి సాము చేయలేదు. ప్రతీ సినిమాలో అంతర్లీనంగా ఒక గొప్ప మానవతా భావాన్ని చూపించే ప్రయత్నం ప్రతి సినిమాలో చేశారు . కులాంతర వివాహాన్ని సమర్థిస్తూ సప్తపది తీశారు, ప్రేమ మనసుకు మాత్రమే అని వైకల్యం అడ్డం కాదని సిరిసిరి మువ్వ సిరివెన్నెల సినిమాలోకి చూపించారు, అహంకారం సాటి కళాకారులను ఎలా తొక్కేస్తుంది స్వాతి కిరణం లో చూపిస్తే, పెళ్లయి భర్తని పోగుట్టుకున్న స్త్రీకి ఓ మనసు ఉంటుందని తోడు కోరుకుంటుందని చూపించిన సినిమా స్వాతి ముత్యం . ఓ వేశ్య కి సహాయం చేయడం వల్ల సమాజం లో తనకున్న గుర్తింపుని ,వృత్తిని కూడా వదులుకున్న హీరో కథతో శంకరాభరణం. సుడి గుండాలు సినిమాలో విశ్వనాథ్ గారు అందించిన కధే కాదు ప్రతి మాట ఈరోజు సమాజానికీ వర్తిస్తూ ఆలోచింప చేస్తుంది. నేరమూ శిక్ష కూడా అలాంటిదే
ఓ సీత కధ, సీత మహాలక్ష్మి , సిరి వెన్నెల, శంకరాభరణం, స్వాతి ముత్యం ,స్వర్ణ కమలం ,స్వాతి కిరణం, సప్తపది శృతి లయాలు, జీవన జ్యోతి ,చెల్లెలి కాపురం ,సాగర సంగమం ఇలా చెప్పుకుంటూ పొతే ఎన్నో. చూసి ఎన్నేళ్లయినా అవి ఎప్పటికీ మనసులో గుర్తుండి పోతాయి సినిమా చూసి థియేటర్ బయటకి వచ్చేసి మర్చిపోయే మామూలు సినిమాలు కావు ఏవి.
అలాంటి కళాకారుడి విద్వత్తుకి ఈ రోజుకి పురస్కారం లభిస్తే ..తనలో లో కళను కాకుండా కులాన్ని మాత్రమే చూస్తున్న సో కాల్డ్ కుల గజ్జి మేధావులను చూసి జాలి వేస్తోంది.
యూనివర్సిటీ లో పిల్లని విప్లవ భావాలూ నూరిపోసి అడవులకు పంపి, జీతం తో పాటు భారీగా కొసర్లు సంపాదిస్తూ, తమ పిల్లని అమెరికాలకు పంపి , ధనువంతుల ఇళ్ల మధ్య లక్సరీ ఫ్లాట్ లో లో కులాసాగా ఓ చేత్తో బూర్జువా పెట్టుబడి దారి సిగిరెట్ లు పట్టుకుని విప్లవాలు కారాలు మిరియాలుగా నూరేసే ఏ ముద్దు గోపాలాల సర్టిఫికెట్ లు .. విశ్వనాధ్ గారికి అక్కర్లేదు.
ప్రేక్షకులు పట్టిన నీరాజనమే ఆయన కళకు నిజమైన సర్టిఫికెట్ ఎప్పుడో ఇచ్చేసింది. ఇప్పుడీ అవార్డు ఆయన్ను వరించి తనను తానూ గౌరవించుకొంది.
లాజికల్ లాజికల్ అంటూ వెతికే వాడికి మనిషి పుట్టుకలనూ అసభ్యత మాత్రమే కనిపిస్తుంది. అమ్మ తనాన్ని చూసే వాడికి పదినెలల అమ్మ కష్టం ప్రేమ కనిపిస్తుంది. చిత్రంగా రెండు వాదనలూ కరెక్టే. కానీ ఏది చూస్తున్నాం అనేది మాత్రం మన సంస్కారం నిర్ణయిస్తుంది.

avee ivee

ప్రతి రోజూ ఎంతో మంది గృహిణులు ఉరేసుకోడం , అదనపు కట్నం కోసం అత్తారింటి వేధింపుల్లో చావడం, భర్త కోపం తో కొట్టే చావు దెబ్బలు తిని చచ్చిపోడం ఇలాంటి వార్తలూ రోజు ..ఎంత లేదన్న ఓ పదో పాతికో చావులు ..లైఫ్ టెలికాస్ట్ లుండవ్. గోడ మీద పిడకలూ ఉండవ్
ఎందుకంటే.. ఎందుకంటే ఈ దేశం లో ఆడవాళ్ళూ "సాంప్రదాయ పద్ధతుల్లో " ఎంచక్కా చచ్చిపోవచ్చు
అప్పుడు అలా అలా ఇంట్లో స్త్రీలను చంపేసుకున్న సాంప్రదాయ కుటుంబాల పట్ల గౌరవంగా ఆ వార్తని చూసి చూడనట్లు అలా స్కిప్ చేసి. సదరు గౌరవనీయ కుటుంబాల గౌరవాన్ని మర్యాదనీ కాపాడేస్తాం . అలా పద్దతిగా చంపేసుకున్న భర్త గారి పేరు కూడా చెప్పకుండా ఆమె భర్త అని మాత్రమే చెప్పి ప్రైవసీ ని కాపాడేస్తాం
ఎటొచ్చి అలా చావకపోతెనే. .నీ చావేదో నువ్వే చచ్చినా . మేం చచ్చినంతగా ఫీల్ అయ్యి .చచ్చేంతలా ఊగిపోతాం .. నర హంతకుల ముఖాలకి సైతం ముసుగేసి గౌరవం కాపాడమని చెప్పే చట్టాన్ని కాసేపు అవతల పెట్టేసి . నీ ముఖాన్ని నీ కుటుంబాన్ని నీ జీవితాన్ని మొత్తం TV లో వెండి తెర మీద చూపించేస్తాం
యు నౌ ఈ దేశం లో ప్రైవసీ applicable ఓన్లీ సంప్రదాయ ఆత్మహత్యలూ సంప్రదాయ హత్యల కే హా 

క్యాలిక్యులేటెడ్ హ్యూమన్ రిలేషన్స్

! musings !!

అవసరానికో అవకాశాలకో స్నేహాలను అనుబంధాలను సునాయాసంగా వాడేస్తూ కృతిమ నవ్వులద్దిన మోములు పలికించే గుడ్ మార్నింగ్ గుడ్ ఈవెనింగ్ ల క్యాలిక్యులేటెడ్ హ్యూమన్ రిలేషన్స్ ని నిజమని భ్రమించే ఇల్యూషన్ ల లైఫ్ నుండీ విసుగొచ్చి పక్కకు ఒదిగి ఒక్క క్షణం నిలబడ్డప్పుడల్లా స్వచ్ఛంగా పలకరించే ఒకానొక అచ్చమైన నవ్వుతో జత కలిపి నడుస్తున్నప్పుడు అనిపిస్తూ ఉంటుంది జీవించడం అంటే మరేం లేదు కాస్త నదిలా ఉరకలేస్తూ ప్రవహించడమేనేమో అని .

విరగ కాసిన వెన్నెల ఒడిసిపట్టిన రెళ్ళు పూలు వెదజల్లే కాంతి మధ్య తడుస్తూ నక్షత్రాల వైపు అనంతంగా సాగిపోతున్న నడక మిగిల్చిన శాశ్వతానందాల ముందు అశాశ్వతమైన కాలం కూడా ఓడిపోవాల్సిందే. తీరికలేని నాగరిక జీవనం ఉరుకుపరుగుల మధ్య నిష్ప్రయోజనం గా కదిలిపోతున్న క్షణాలను చూసి అశాశ్వతమైన క్షణాలు తిరిగి రావనుకుంటాం కానీ కొన్ని నిశ్చలమైన ఆనందాలను దిగంతాలు వ్యాపించిన వెలుగుపూల మధ్య ఆంతరంగిక ప్రేమైక భావనను ఒంపుకున్నప్పుడు క్షణాలకూ అమరత్వమేదో వచ్చేస్తుంది కాకుంటే రూపు మార్చుకొని జ్ఞాపకంగా గుండెలో స్థిరపడతాయేమో

అసలు ఇన్నాళ్లూ అజ్ఞాతంగా నాలోనే దాక్కున్నా కొన్ని అభావ వాక్యాలేవో ఇప్పుడిప్పుడే ప్రకృతినద్దుకొని అడవి మల్లెల అక్షరాలై రాలుతున్నాయి .ఎప్పటిదో ఎప్పుడు ఎలా మొదలయ్యిందో కానీ ఈ అన్వేషణ కృతిమత్వం నుండీ నెమ్మదిగా సహజత్వాన్ని కోరుకుంటూ కాస్త ప్రకృతి దిశగా అడుగులేస్తూ ఇలా సాగిపోవాలని బహుశా చెంతగా వెన్నెల విసిరే నీ నవ్వులని తోడు తీసుకెళ్లడం మొదలైనప్పటి నుండేమో



మార్నింగ్ రాగ (musings )



కురుస్తున్న తెలి మంచు తునకల నడుమ , మబ్బు తెరల మధ్య తొంగి చూస్తున్న నులి వెచ్చని తొలి వేకువ కిరణాలను హత్తుకుంటూ ఉషోదయాస్వాదనతో మన నడక సాగించడం అంటే ఓ రోజు మొత్తాన్ని నడిపించే తేజోమయ శక్తిని హృదయం లోకి ప్రవహింప చేయడమేగా .

చీకటి అశాశ్వతమని ప్రతీ చీకటి ముగింపు ఎప్పుడూ వెలుగు మాత్రమే అని ప్రభాత వెలుగు పూలు అందించే సందేశాన్ని అందుకుంటూ ..నిశ్శబ్డాలను చీలుస్తూ శ్రావ్యంగా వినిపించే కువకువల ప్రణవ నాదాలకు క్షణాలను శృతి చేస్తూ జతగా నడవడం ..అలసట దరిజేరని పగటి సమయాలపై రాస్తున్నముందుమాటలా ఉంది కదా.

ప్రకృతి తో సమయాలను అంటుకట్టడం అంటే కాలప్రవాహం లో దొర్లిపోయే ప్రతీ రోజుపై అనుభూతుల సంతకాలను బ్రతుకు పుస్తకం లో లిఖించుకోడమే కదూ .

ఇప్పుడు ఇలా నవ్వులు విత్తనాలు దారంతా జల్లుకుంటూ వెళ్తున్నాం గానీ ..మళ్ళీ ఈ దారంతా నడిచినప్పుడల్లా ఈ మోదుగు పూలు చెట్లకు ఆ కబుర్లు అన్నీ జ్ఞాపకాలుగా పూసి గాలి రెక్కలపై ఎన్ని పరిమళాలు మోసుకొస్తాయో

నిజంగా కాలం విలువ ఇప్పటిదాకా తెలియలేదు కానీ. విరిగిపడిన శూన్య శకలాలపై తిరిగి కలల్ని నిర్మించడం మొదలు పెట్టాక లిప్తలు కూడా ఎంత విలువద్దుకున్నాయో. అవ్యక్తమైన ఆనందాలన్నీ సజీవంగా మారితే అది నువ్వే అని ఇదిగో ఇప్పుడిప్పుడే నాకూ తెలుస్తోంది సుమా!!

ప్రాజెక్ట్ హింసలు

పిల్లల్ని స్కూల్ వేసేసి ఇక మా బుడంకాయలు హ్యాపీ గా చదివేసుకుంటారు ఓ మంచి స్కూల్ లో వేసేసాం అని హ్యాపీ గా ఫీల్ అయి సంబరపడి పోయినంత సేపు పట్టలేదు . "ప్రాజెక్ట్ వర్క్ " అనే ఓ భూతం అల్లావుద్దీన్ అద్భుత దీపం నుండీ హఠాత్తుగా వచ్చేసినట్లు అడుగుపెట్టి నా జీవితం తో ఆడుకోడం మొదలు పెట్టింది.
చిత్ర విచిత్రమైన ప్రాజెక్ట్ హింసలు ఎక్కడ దొరుకుతాయో తెలియదు రోజూ రోడ్డు మీద పడి సెర్చింగ్ లే . దొరికాక ఇంకో గంటో రెండు గంటలో మొత్తం రెండు మూడు గంటలు ప్రాజెక్టార్పణం .
హమ్మయ్య ప్రాజెక్ట్ వర్క్ అయిపొయింది అని గాట్టిగా ఊపిరి పీల్చుకొని వదిలినంత సేపు పట్టదు మమ్మీ అంటూ బస్సు దిగుతూనే "మా టీచర్ ఈ రోజు ప్రాజెక్ట్ ఇచ్చింది అంటూ ఇంకో బాంబు పేల్చడానికి
అయినా అన్ని ప్రాజెక్ట్ రోజులూ ఒక్కలాగే ఉండవ్  కొన్ని మరీ ఇబ్బంది పెట్టేస్తాయ్ అలాంటి ఓ దుర్దినం  సరిగ్గా ఆ రోజు మా కార్ డ్రైవర్ కూడా రాలేదు.
ఇండియా మ్యాప్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఫ్రీడమ్ కొని A4 షీట్ మీద పేస్ట్ చేయమంది అంటూ వచ్చాడు.ఇంట్లో ప్రింటర్ ఉంది నెట్ నుండీ ప్రింట్ తీస్తా నాన్న అంటే నెట్ లో డౌన్లోడ్ చేసిన ప్రింట్ not allowed అని రాసిన డైరీ చూపించాడు. ఆ ముక్క రెడ్ ఇంకుతో రాసి మరీ నొక్కి వక్కాణించేసింది టీచరమ్మ .
తప్పుతుందా. . ఇక ఆటో ఎక్కి మ్యాప్ కొనడం అనే ప్రక్రియ మొదలు పెట్టా. ఆబ్బె స్టేషనరీ షాప్ లు బిక్క మొహం వేశారు అలా వెతుకుతూ వెతుకుతూ కొంపదీసి దేశం దాటేస్తా నెమో అని భయం కూడా వేసి దొరకట్లే ఇక ఇంటికెళదాం అనగానే మా వాడు ఏడుపు మా టీచర్ కొట్టేస్తుంది అని .
పనిలో పనిగా ఆగిన ప్రతీ స్టేషనరీ షాప్ లో ..వాడి కంటికి ఆకర్శించిన వస్తువు కొనిపించేస్తూ వాడి పనిలో వాడున్నాడు. వెతగ్గా వెతగ్గా ఓ స్టేషనరీ షాప్ వాడు దయతలచి దుమ్ము కొట్టుకుపోయిన పేపర్లు అటక మీది నుండీ తీసి. ఇందులో వెతుక్కోండి అని జాలి పడ్డాడు. సరే తుమ్ముకుంటూ వెతుకుతూ ఉంటే అదృష్టం మ్యాప్ రూపం లో వచ్చి దొరికేసింది.
హుమ్మయ్య అని కొనేసి బయటకి రాగానే పెద్ద వర్షం దొరక్క దొరక్క దొరికింది తడిసిపోతే ఎలా అబ్బా అని ఆలోచించే లోగా మా వాడు దయతలచి పోనీలే అమ్మ అక్కడ McDonald కాసేపు కూర్చుందాం .ఆ మాట వినగానే ఇక మా పొట్టిది ఐస్క్రీమ్ కావాలి అంటూ పాట మొదలు పెట్టింది నాలుగు వీధులు వినబడేంత పెద్ద గొంతు వేసుకొని .అలా కొంటూ ఉంటే అలవాటయి పోతుంది అనేసి . భీష్మించి కూర్చున్నా
నా దురదృష్టం పక్కన నిల్చున్న వాళ్ళ రూపం లో మళ్ళీ తగులుకుంది పాపా అంతలా ఏడుస్తోంది పాపం కొనివ్వమా అంటూ ..ఇంకాసేపు అలాగే ఉంటే.. వల్లే తోసేసేట్టు ఉన్నారు ..సరే తప్పుతుందా McDonald లో కూర్చున్నాక ఇద్దరూ ఆర్డర్ చేసిన లిస్ట్ లు చదివించుకున్నాక ..బతుకు జీవుడా అని ఇంటికి చేరాం
లెక్క చూసుకుంటే. ఓ రెండు రూపాయల మ్యాప్ కోసం ఖర్చు పెట్టింది రెండువేల రూపాయలు, ఆటో ఖర్చులు, స్టేషనరీ షాప్ లో వాడు కొన్నవి, McDonald తిన్నవి ప్లస్ ఆ రోజులో ఓ మూడు గంటల సమయం
పొద్దున్న స్కూల్ వెళుతున్నప్పుడు వాడి మొహం లో ఆనందం చూసి ఆనందపడినంత సేపు పట్టలేదు ..సాయంత్రం రాగానే మా చిన్నది అమ్మ రేపు స్కూల్ లో రాఖీ మేకింగ్ competition అంటూ డైరీ చూపించింది. చూస్తే పెద్ద లిస్ట్ . ఇన్నేళ్ల జీవితం లో తయారు చేసిన రాఖీలు కొనడమే తప్ప ఎప్పుడూ తయారుచేసింది లేదు. పోనీ అదేమన్నా ఇంట్లో available వస్తువులతో అంటే కాస్త creativity తొక్క తోలూ అనుకోవచ్చు ఆబ్బె అదీ లేదు. "రాఖీ మేకింగ్ స్టఫ్ " అని మార్కెట్ లో కొత్తగా వచ్చాయట అగొ అవి మాత్రమే కొని వాడు చెప్పిన ప్రకారం మాత్రమే చేయాలి. .ఇక అందులో క్రియేటివిటీ ఏముంటుందో నా చిన్ని బుర్రకి అర్ధం కాక మళ్ళీ ఇంకో ప్రాజెక్ట్ దుర్దినం అని తిట్టుకుంటూ ..ఊరంతా వెతికి వెతికి మొత్తానికి కొని .. ఈ రోజు వెళ్లి స్కూల్ ..లో దాని చేత చేయించడం అదే లెండి పేరుకే బుజ్జి దాన్ని పక్కన కూర్చోబెట్టి నేను చేసి వచ్చా. అలా ఈరోజు శ్రమదానం
అసలు నాకో విషయం అర్ధం కాదు.
సబ్జెక్టు ఇంపార్టెంట్ అయితే.. నెట్ నుండీ డౌన్లోడ్ చేసినా సరిపోతుంది. కానీ ఇలా స్టేషనరీ షాప్ లో కొన్నదే ఎందుకో అర్ధం కాలే . ఈ రాఖీ మేకింగ్ కూడా నిండా నాలుగేళ్లు లేని పిల్ల ఏం చేస్తుంది. దాని బదులు మేము చేయడం వళ్ళ కలిగే ప్రయోజనాలు ఏమిటి. సొంతంగా తయారు చేయాలి అంటే కాస్త బుర్ర పెట్టి చేసేవాళ్ళం కానీ వాడిచ్చిన పాకెట్ లో వాడి ప్రకారం జాయింట్ చేసుకుంటూ పోడం లో పొడిచేసి creativity ఏముంటుంది. ఇలా తన్నుకొచ్చిన ఆవేశం అప్పుడే ఫోన్ చేసిన friend తో కక్కగానే అదీ మొదలెట్టింది దాని ప్రాజెక్ట్ కస్టాలు.
హోల్ పెపంచం అంతా ఐదో క్లాస్ లోపు పిల్లలకి హోమ్ వర్క్ వద్దు మొర్రో అంటాయి కనీసం ఆక్టివిటీస్ కూడా ఇంటిదగ్గర చేయమని చెప్పరు. మొత్తం స్కూల్ లోనే చేయిస్తారు. పిల్లలు వాళ్ళంతట వాళ్ళు హోమ్ వర్క్ చేసే స్టేజి ఆరో తరగతి తర్వాతే నమ్ముతారు. ఆ మాట కొస్తే ఇండియా లో కూడా అధికారికంగా ఒక GO ఉంది ఇదే విధంగా కానీ ..ఆచరణలో నర్సరీ పిల్లలకీ హోమ్ వర్కులు ప్రాజెక్ట్ వర్క్ లు. .స్కూల్ నుండీ రావడం తోనే ఆడుకునే రోజులు పోయి. స్టేషనరీ షాప్ ల చుట్టూ తిరిగితే రోజులు మొదలయ్యాయి. ఫెస్టివల్ వస్తే ఈ కస్టాలు ఇక రెట్టింపు .
ఈ దేశానికేమయ్యింది.. .ఒక వైపు చదువులూ .ఇంకో వైపు ప్రాజెక్ట్ లు. ఎవరూ మాట్లాడరేం .. 
నాకేంటో మళ్ళీ LKG చేరినట్లు కలలొస్తున్నాయ్ రోజూ......పేరెంటింగ్ అంటే ఇదివరకటిలా ప్రోగ్రెస్ కార్డు లో సంతకం పెట్టినంత వీజి కాదు వాళ్ళతో పాటు మళ్ళీ చదువుకోడం .