అవసరానికో అవకాశాలకో స్నేహాలను అనుబంధాలను సునాయాసంగా వాడేస్తూ కృతిమ నవ్వులద్దిన మోములు పలికించే గుడ్ మార్నింగ్ గుడ్ ఈవెనింగ్ ల క్యాలిక్యులేటెడ్ హ్యూమన్ రిలేషన్స్ ని నిజమని భ్రమించే ఇల్యూషన్ ల లైఫ్ నుండీ విసుగొచ్చి పక్కకు ఒదిగి ఒక్క క్షణం నిలబడ్డప్పుడల్లా స్వచ్ఛంగా పలకరించే ఒకానొక అచ్చమైన నవ్వుతో జత కలిపి నడుస్తున్నప్పుడు అనిపిస్తూ ఉంటుంది జీవించడం అంటే మరేం లేదు కాస్త నదిలా ఉరకలేస్తూ ప్రవహించడమేనేమో అని .
విరగ కాసిన వెన్నెల ఒడిసిపట్టిన రెళ్ళు పూలు వెదజల్లే కాంతి మధ్య తడుస్తూ నక్షత్రాల వైపు అనంతంగా సాగిపోతున్న నడక మిగిల్చిన శాశ్వతానందాల ముందు అశాశ్వతమైన కాలం కూడా ఓడిపోవాల్సిందే. తీరికలేని నాగరిక జీవనం ఉరుకుపరుగుల మధ్య నిష్ప్రయోజనం గా కదిలిపోతున్న క్షణాలను చూసి అశాశ్వతమైన క్షణాలు తిరిగి రావనుకుంటాం కానీ కొన్ని నిశ్చలమైన ఆనందాలను దిగంతాలు వ్యాపించిన వెలుగుపూల మధ్య ఆంతరంగిక ప్రేమైక భావనను ఒంపుకున్నప్పుడు క్షణాలకూ అమరత్వమేదో వచ్చేస్తుంది కాకుంటే రూపు మార్చుకొని జ్ఞాపకంగా గుండెలో స్థిరపడతాయేమో
అసలు ఇన్నాళ్లూ అజ్ఞాతంగా నాలోనే దాక్కున్నా కొన్ని అభావ వాక్యాలేవో ఇప్పుడిప్పుడే ప్రకృతినద్దుకొని అడవి మల్లెల అక్షరాలై రాలుతున్నాయి .ఎప్పటిదో ఎప్పుడు ఎలా మొదలయ్యిందో కానీ ఈ అన్వేషణ కృతిమత్వం నుండీ నెమ్మదిగా సహజత్వాన్ని కోరుకుంటూ కాస్త ప్రకృతి దిశగా అడుగులేస్తూ ఇలా సాగిపోవాలని బహుశా చెంతగా వెన్నెల విసిరే నీ నవ్వులని తోడు తీసుకెళ్లడం మొదలైనప్పటి నుండేమో

No comments:
Post a Comment