Tuesday, December 26, 2017

దిగులు దేహాన్నై

ఆరాటం గా అనుకుంటా
ఈ సారన్నా
నన్ను నీ దగ్గర నుండీ
తిరిగి తెచ్చేసుకోవాలని
గడ్డి పూల మధ్య
ఓ సాయంత్రాన్నలా పరిచేసి
కబుర్ల కాగితాలన్నీ
మడత విప్పి చదివేస్తూ
ఆప్త క్షణాలు అద్ది
జీవితం ఖాళీతనాల మీద
సంతోషాన్ని బొమ్మగా గీసేస్తుంటే
వెళ్లాల్సిన సమయమొకటి
వచ్చేసిందని
వదిలీ వదల్లేక
భారంగా నే అనుకో
దిగుళ్ళని దాచేయాలనే తొందర్లో
నవ్వుని నటించడం రాక
బెంగటిల్లుతున్న నీ కళ్ళకి
నవ్వుతూ వాన చినుకుల్ని
తోడిచ్చి పంపాను కానీ
ఈ సారీ ఎప్పటిలా
నన్ను మాత్రం
నీలో మర్చిపోయి
దిగులు దేహాన్నై తిరిగొచ్చేసా


No comments:

Post a Comment