Tuesday, December 26, 2017

ప్రాజెక్ట్ హింసలు

పిల్లల్ని స్కూల్ వేసేసి ఇక మా బుడంకాయలు హ్యాపీ గా చదివేసుకుంటారు ఓ మంచి స్కూల్ లో వేసేసాం అని హ్యాపీ గా ఫీల్ అయి సంబరపడి పోయినంత సేపు పట్టలేదు . "ప్రాజెక్ట్ వర్క్ " అనే ఓ భూతం అల్లావుద్దీన్ అద్భుత దీపం నుండీ హఠాత్తుగా వచ్చేసినట్లు అడుగుపెట్టి నా జీవితం తో ఆడుకోడం మొదలు పెట్టింది.
చిత్ర విచిత్రమైన ప్రాజెక్ట్ హింసలు ఎక్కడ దొరుకుతాయో తెలియదు రోజూ రోడ్డు మీద పడి సెర్చింగ్ లే . దొరికాక ఇంకో గంటో రెండు గంటలో మొత్తం రెండు మూడు గంటలు ప్రాజెక్టార్పణం .
హమ్మయ్య ప్రాజెక్ట్ వర్క్ అయిపొయింది అని గాట్టిగా ఊపిరి పీల్చుకొని వదిలినంత సేపు పట్టదు మమ్మీ అంటూ బస్సు దిగుతూనే "మా టీచర్ ఈ రోజు ప్రాజెక్ట్ ఇచ్చింది అంటూ ఇంకో బాంబు పేల్చడానికి
అయినా అన్ని ప్రాజెక్ట్ రోజులూ ఒక్కలాగే ఉండవ్  కొన్ని మరీ ఇబ్బంది పెట్టేస్తాయ్ అలాంటి ఓ దుర్దినం  సరిగ్గా ఆ రోజు మా కార్ డ్రైవర్ కూడా రాలేదు.
ఇండియా మ్యాప్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఫ్రీడమ్ కొని A4 షీట్ మీద పేస్ట్ చేయమంది అంటూ వచ్చాడు.ఇంట్లో ప్రింటర్ ఉంది నెట్ నుండీ ప్రింట్ తీస్తా నాన్న అంటే నెట్ లో డౌన్లోడ్ చేసిన ప్రింట్ not allowed అని రాసిన డైరీ చూపించాడు. ఆ ముక్క రెడ్ ఇంకుతో రాసి మరీ నొక్కి వక్కాణించేసింది టీచరమ్మ .
తప్పుతుందా. . ఇక ఆటో ఎక్కి మ్యాప్ కొనడం అనే ప్రక్రియ మొదలు పెట్టా. ఆబ్బె స్టేషనరీ షాప్ లు బిక్క మొహం వేశారు అలా వెతుకుతూ వెతుకుతూ కొంపదీసి దేశం దాటేస్తా నెమో అని భయం కూడా వేసి దొరకట్లే ఇక ఇంటికెళదాం అనగానే మా వాడు ఏడుపు మా టీచర్ కొట్టేస్తుంది అని .
పనిలో పనిగా ఆగిన ప్రతీ స్టేషనరీ షాప్ లో ..వాడి కంటికి ఆకర్శించిన వస్తువు కొనిపించేస్తూ వాడి పనిలో వాడున్నాడు. వెతగ్గా వెతగ్గా ఓ స్టేషనరీ షాప్ వాడు దయతలచి దుమ్ము కొట్టుకుపోయిన పేపర్లు అటక మీది నుండీ తీసి. ఇందులో వెతుక్కోండి అని జాలి పడ్డాడు. సరే తుమ్ముకుంటూ వెతుకుతూ ఉంటే అదృష్టం మ్యాప్ రూపం లో వచ్చి దొరికేసింది.
హుమ్మయ్య అని కొనేసి బయటకి రాగానే పెద్ద వర్షం దొరక్క దొరక్క దొరికింది తడిసిపోతే ఎలా అబ్బా అని ఆలోచించే లోగా మా వాడు దయతలచి పోనీలే అమ్మ అక్కడ McDonald కాసేపు కూర్చుందాం .ఆ మాట వినగానే ఇక మా పొట్టిది ఐస్క్రీమ్ కావాలి అంటూ పాట మొదలు పెట్టింది నాలుగు వీధులు వినబడేంత పెద్ద గొంతు వేసుకొని .అలా కొంటూ ఉంటే అలవాటయి పోతుంది అనేసి . భీష్మించి కూర్చున్నా
నా దురదృష్టం పక్కన నిల్చున్న వాళ్ళ రూపం లో మళ్ళీ తగులుకుంది పాపా అంతలా ఏడుస్తోంది పాపం కొనివ్వమా అంటూ ..ఇంకాసేపు అలాగే ఉంటే.. వల్లే తోసేసేట్టు ఉన్నారు ..సరే తప్పుతుందా McDonald లో కూర్చున్నాక ఇద్దరూ ఆర్డర్ చేసిన లిస్ట్ లు చదివించుకున్నాక ..బతుకు జీవుడా అని ఇంటికి చేరాం
లెక్క చూసుకుంటే. ఓ రెండు రూపాయల మ్యాప్ కోసం ఖర్చు పెట్టింది రెండువేల రూపాయలు, ఆటో ఖర్చులు, స్టేషనరీ షాప్ లో వాడు కొన్నవి, McDonald తిన్నవి ప్లస్ ఆ రోజులో ఓ మూడు గంటల సమయం
పొద్దున్న స్కూల్ వెళుతున్నప్పుడు వాడి మొహం లో ఆనందం చూసి ఆనందపడినంత సేపు పట్టలేదు ..సాయంత్రం రాగానే మా చిన్నది అమ్మ రేపు స్కూల్ లో రాఖీ మేకింగ్ competition అంటూ డైరీ చూపించింది. చూస్తే పెద్ద లిస్ట్ . ఇన్నేళ్ల జీవితం లో తయారు చేసిన రాఖీలు కొనడమే తప్ప ఎప్పుడూ తయారుచేసింది లేదు. పోనీ అదేమన్నా ఇంట్లో available వస్తువులతో అంటే కాస్త creativity తొక్క తోలూ అనుకోవచ్చు ఆబ్బె అదీ లేదు. "రాఖీ మేకింగ్ స్టఫ్ " అని మార్కెట్ లో కొత్తగా వచ్చాయట అగొ అవి మాత్రమే కొని వాడు చెప్పిన ప్రకారం మాత్రమే చేయాలి. .ఇక అందులో క్రియేటివిటీ ఏముంటుందో నా చిన్ని బుర్రకి అర్ధం కాక మళ్ళీ ఇంకో ప్రాజెక్ట్ దుర్దినం అని తిట్టుకుంటూ ..ఊరంతా వెతికి వెతికి మొత్తానికి కొని .. ఈ రోజు వెళ్లి స్కూల్ ..లో దాని చేత చేయించడం అదే లెండి పేరుకే బుజ్జి దాన్ని పక్కన కూర్చోబెట్టి నేను చేసి వచ్చా. అలా ఈరోజు శ్రమదానం
అసలు నాకో విషయం అర్ధం కాదు.
సబ్జెక్టు ఇంపార్టెంట్ అయితే.. నెట్ నుండీ డౌన్లోడ్ చేసినా సరిపోతుంది. కానీ ఇలా స్టేషనరీ షాప్ లో కొన్నదే ఎందుకో అర్ధం కాలే . ఈ రాఖీ మేకింగ్ కూడా నిండా నాలుగేళ్లు లేని పిల్ల ఏం చేస్తుంది. దాని బదులు మేము చేయడం వళ్ళ కలిగే ప్రయోజనాలు ఏమిటి. సొంతంగా తయారు చేయాలి అంటే కాస్త బుర్ర పెట్టి చేసేవాళ్ళం కానీ వాడిచ్చిన పాకెట్ లో వాడి ప్రకారం జాయింట్ చేసుకుంటూ పోడం లో పొడిచేసి creativity ఏముంటుంది. ఇలా తన్నుకొచ్చిన ఆవేశం అప్పుడే ఫోన్ చేసిన friend తో కక్కగానే అదీ మొదలెట్టింది దాని ప్రాజెక్ట్ కస్టాలు.
హోల్ పెపంచం అంతా ఐదో క్లాస్ లోపు పిల్లలకి హోమ్ వర్క్ వద్దు మొర్రో అంటాయి కనీసం ఆక్టివిటీస్ కూడా ఇంటిదగ్గర చేయమని చెప్పరు. మొత్తం స్కూల్ లోనే చేయిస్తారు. పిల్లలు వాళ్ళంతట వాళ్ళు హోమ్ వర్క్ చేసే స్టేజి ఆరో తరగతి తర్వాతే నమ్ముతారు. ఆ మాట కొస్తే ఇండియా లో కూడా అధికారికంగా ఒక GO ఉంది ఇదే విధంగా కానీ ..ఆచరణలో నర్సరీ పిల్లలకీ హోమ్ వర్కులు ప్రాజెక్ట్ వర్క్ లు. .స్కూల్ నుండీ రావడం తోనే ఆడుకునే రోజులు పోయి. స్టేషనరీ షాప్ ల చుట్టూ తిరిగితే రోజులు మొదలయ్యాయి. ఫెస్టివల్ వస్తే ఈ కస్టాలు ఇక రెట్టింపు .
ఈ దేశానికేమయ్యింది.. .ఒక వైపు చదువులూ .ఇంకో వైపు ప్రాజెక్ట్ లు. ఎవరూ మాట్లాడరేం .. 
నాకేంటో మళ్ళీ LKG చేరినట్లు కలలొస్తున్నాయ్ రోజూ......పేరెంటింగ్ అంటే ఇదివరకటిలా ప్రోగ్రెస్ కార్డు లో సంతకం పెట్టినంత వీజి కాదు వాళ్ళతో పాటు మళ్ళీ చదువుకోడం .

No comments:

Post a Comment