Thursday, October 27, 2016

ఉద్యమాల ఉరిలో


ఇప్ప్పుడో దేహం
మరో వాదానికి వేలాడింది 
కొన్ని మరణాలు
ఉరికొయ్య నుండీ
నిశ్సబ్దంగా స్మశానానికి చేరుకుంటే 
కొన్ని మరణాలు
ఉద్యమాలద్దుకొని
దేశమంతా ఊరేగుతాయి 

కళాశాలల వధ్యశిలపై
పదును పెట్టే వాద ప్రతివాదాల కత్తులకు 
రక్త తర్పణం
ఎప్పుడూ ఉరకలేసే ఉడుకు రక్తాలదేగా
బలిదానాలైనా .. బలి కోరే కత్తులైనా 
వాదం వాదం వాదం అయితేనేమి 
అన్నీ అస్తవ్యస్త కుటుంబాల ,
పీడిత సమాజ ఉత్పత్తులే 

సున్నితత్వం మరచిన
మనసులో పిడివాదాల విత్తు జల్లితే 
మొలకెత్తివి ఎప్పుడూ
మరణతరువులేగా 

వాదనలెప్పుడూ
సున్నితంగా తర్కిస్తే చర్చగా ముగుస్తాయని 
లేకుంటే రచ్చగానే మిగుల్తాయని
తెలుకోలేని పసి మనసులిప్పుడు 
కుల మత రాజకీయ క్రీడలో నేతల చేతి అస్త్రాలే 
వయసు వాడిలో వేడిలో
మాటలు తూటాలు గా పేలుస్తూ 
ఒకరి మనసులోకరు గాయ పరచుకుంటూ 
తమ జీవితాలకు
తామే మరణ శాసనాలు రాసుకుంటూ 
ఉద్యమాలకు ఊపిరి పోసామనే భ్రమలో 
ఉద్యమ సోపానాల
పరమద పీఠం పై
నేతల సింహాసనాలకు 
ఇటుకలు పేర్చే తాపీలు వాళ్ళు 
చేగువురా జీవితం లో
తుపాకీ పేల్చడం మాత్రమె అర్ధం చేసుకునే వయసు
జనం లో తానూ గళమై జనమే
తన గళమై జనంతో మమేకమై 
పోరాట బాణం ఎప్పుడూ
పాలకులు సృష్టించిన అసమాన వ్యవస్థ పైనే కాని 
సాటి జనం పై కాదని చెప్పే
చే జీవితం
అర్ధం చేసుకుంటేగా 
లేత యెర్ర సూరీల్లు .

ప్రచండ భానులై విప్లవ కిరణాలు ప్రసరించేది

అక్షర చినుకులు

// అక్షర చినుకులు / /

ముసిరిన భావాలెన్నో
ఆలోచనలుగా కురిసి
కాగితాన్ని తడిపిన
అక్షరాల చినుకులు
హటాత్తుగా అలిగి
ఆగిపోయాయి
ఘనీభవించిన మనసు
మౌనాన్ని ఆశ్రయించాక
నిశ్శబ్దంపుటంచుల్లొ  
వేళ్ళాడుతున్న భావాలు
అవ్యక్తమైన అభావాలుగా 
దిగులు మేఘంలా
మది ఆకసాన్ని
అంటిపెట్టుకుని ఉంటె
కాగితంపై ఇక

కురిసేదెప్పుడని

జ్ఞాపకాల జుగల్బంది



నా మనుసులో 
నీ ఉనికి ని వెతకమని 
నిన్న రాత్రి వెన్నెలతో చెప్పి 
పంపించావేమో.. 
తెరచిన కిటికీ నుండి 
వెన్నెల చినుకులు వర్షిస్తూ .
.
నువ్వు తెచ్చిన సందేశం ,, 
రేయి నిశబ్దాన్ని బద్దలు చేస్తూ 
సన్నగా మదిలో జ్ఞాపకాల జుగల్బంది 
మొదలు పెట్టేశాయి . 
తడి ముంగురులు సవరిస్తూ , 
చెవిలో గుస గుస మని 
నువ్వే మాట్లడుతున్నావేమో అనిపించేలా ,, 
నాలో ఉన్న నిన్ను ,, 
నా ముందర ఆవిష్కరించేసాయి 
తప్పి పోయిన కలలన్నీ 
మళ్ళీ వెతుక్కుంటూ మళ్ళీ వచ్చేసాయి . 
నాలో ఉన్న నిన్ను దూరం చేయలేని 
నా అసహాయతను చూసి నవ్వుకుంటూ 
ఒక్కసారిగా నా నుండి 
నేను దూరంగా జరిగిపోయాను 
నీ నీడలో ఒదిగిపోతూ .

వెన్నెల

వెన్నెల నింపుకొన్న
నీ  దోసిళ్ళ మద్య
చిక్కుకున్న కలలను
విడిపించడం
కాస్త అసాధ్యమని
తెలిసినా.
ఇదిగో ఇలా కొంచెం  కోపాన్ని
నీ పై విసురుతానో లేదో
ఎప్పటికప్పుడు నీ నవ్వులతో
మంచు బిందువులుగా మారుస్తూ
ఓ అల్లరి హిమ సమీరం లా
చుట్టేస్తూ తిరిగి కురిపిస్తుంటే
ఏమనిపిస్తోందో తెలుసా
కొన్ని పరిచయాలు
ఎప్పుడూ

శిశిరాన్ని 
తాకని వసంతాలేనని 

వేకువ



నిశీధి చీకట్లను
చీల్చుకుంటూ
రెండు దోసిళ్ళ నిండా
వెన్నెల నింపుకొని
చైతన్య ఝరి..లా
చేతులు చాచి
ఆహ్వానిస్తున్న
తొలి వేకువలా అతను

వేకువ సెలయేర్లు
మది మంజూషాన్ని
తడుముతుంటే
వెన్నెల్లో చిక్కుకున్న
తన కలలను
వెతుక్కుంటూ
తొలి మంచు
వెండి కిరణం లా
అతని కళ్ళని
తాకుతూ ఆమె

ఎడతెగని ఊసులతో
స్నానిస్తున్న
క్షణాల మద్య
తడిసి పోతూ
వేకువ పరిచయిస్తోన్న
వెలుగు రేఖలద్దుకుంటూ
కొత్త ఉషోదయాన్ని
కలిసి స్వాగతిస్తూ

ఇద్దరూ

తొలకరి


ఓ ఆనందమో 
ఓ ఆశ్చర్యమో 
ఓ ఆక్రోశమో
ఆర్ద్రతో ,, ఆవేదనో 
తెలిసిన సంగతులో 
తెలుసుకోవాలనే తపనో
అసంకల్పితం గా 
అంతరంగం లో 
అనుక్షణం 
నిశ్శబ్దం గా సాగే 
అనుభూతుల 
సవ్వడులు
కలం పై కాస్త 
కదిలించాలనుకుంటే 
పదాల పరిధులలో 
ఒదగని భావాలు 
ఆషాడ మేఘాలై 
మదిలోనే 
దోబూచులాడుతుంటే 
ఓ తొలకరి 
ఇటుగా వచ్చి పలకరించింది 
కాసేపిలా వచ్చి 
కురిసేయమని 
సాహితీ సేద్యం 
చేసి భావాలు
పండింద్దామని


రెండు నిశబ్ధాలు

రెండు నిశబ్ధాలు
ఉన్నట్లుండి ఢీ కొన్న శబ్దం
కొన్ని అలజడులు మెరిపిస్తూ
కొన్ని సంఘర్షణల
ఘర్షణ ల రాపిడిలో
ఏకధాటిగా కురుస్తోన్న
మౌన వర్షాల మధ్య

చిక్కటి చీకట్ల చీల్చుకుంటూ
కొంచెం కొంచెం గా
మాటల పుప్పొడిని రాలుస్తూ
గుండె సవ్వడిగా నువ్వు  వినిపిస్తే

బరువుగానో
అసంకల్పితంగా నో
వాగు ప్రక్కన్న
పూల రెక్కల పరిమళాలు
నీ నవ్వులని అద్దుకొని
శిశిర పత్రాలను రాల్చుకుంటూ
చిక్కుకొన్న సందిగ్దా ల నడుమ
వసంతం లా కమ్మేస్తూ

మళ్ళీ కొత్తగా చిగురిస్తానేమో

రాయబారం

రాయబారం

అప్పుడెప్పుడో ఓ సాయంత్రం 
నీ అడుగులు కొన్ని 
ఇటు వైపుగా కదలివస్తోంటే 
అదిగో ఆ క్షణమే అనిపించింది 
ఒక్కోసారి కలలు కూడా 
అమాంతం నడిచ్చొస్తాయని
కడలి ఒడ్డున కాసిని క్షణాలు 
మనవిగా మలుచుకుంటూ 
జతగా నీతో వేసిన అడుగులు 
పోతపోసిన శూన్యాన్ని తరిమేస్తుంటే 
ఆ క్షణమే అనిపించింది 
కలిసి వేసే అడుగులెప్పుడూ
తడబడవని
నేన్నున్న చీకట్లోకి 
నువ్వు విసిరిన కలలు కొన్ని 
ఒంటరి జీవితం పై 
వెలుగుపూల సంతకం చేసాక 
కిటికీ పరదా దాటుకొని కురుస్తోన్న 
వెన్నెల కిరణాలు 
మనిద్దరి మధ్య దూరాన్ని 
విరహం తో భర్తీ చేస్తోంటే 
ఆ వెన్నెల రాదారి పై 
ఎప్పటికీ నీతో కలిసి నడవాలనే 
ఆశలన్నీ అక్షరాలుగా మార్చి 
పంపిస్తున్నా 
రాయంచ రాయబారాన్ని