Thursday, October 27, 2016

నిన్నటి స్వప్నం

కొన్ని క్షణాలు
ఎందుకు వస్తాయో
మరచిపోయిన
నవ్వుల్నీ మళ్ళీ పూయిస్తూ
మనసుకు
కాస్త తడితనాన్ని అద్దుతూ
శూన్యాన్ని మళ్ళీ  అశూన్యం చేస్తూ
కాలానికి వదిలేసిన స్మృతులను
గాలం వేసి మరీ లాక్కొస్తుంటే
అసంకల్పితంగా
బెంగగా
గుండె అంచులో
నుండీ ఏదో రాలిన సవ్వడి
విచ్చుకుంటున్న
జ్ఞాపకాలు పుటల్లో
తెరిచిన కొద్దీ ఎన్ని పరిమళాలో
అన్నీ
నిన్ను వెంటేసుకుని వచ్చేవే

నిన్ను దాటి వచ్చే క్షణాలు ఏవీ లేవుగా
దిగులుతో దాచేసిన కొన్ని చినుకులు
ఇప్పుడు
యెడ తెరపి లేకుండా కురుస్తూనే ఉన్నాయి
చేజారిన నిన్నటి స్వప్నంలా
నువ్వు  ఎదురై
నాలో ఉన్న నిన్ను నిదుర లేపుతూ
ఈ ఏకాంతం లో మళ్ళీ వినిపిస్తుంటే
తడి ముంగురులు
సవరిస్తూ నీ వేలి స్పర్శలు
జ్ఞాపకాల జలతారు
ఊయలపై  కాసేపు ఊపుతుంటే
కొన్ని క్షణాలు

ఇలా ఆగిపోతే ఎంత బాగుంటుందో 

No comments:

Post a Comment