!! అల్విదా నేస్తం !!
ఘనీభవించిన మనసు
నిశ్శబ్దాన్ని
హత్తుకున్నాక
ఇప్పుడెలాంటి
మనోశబ్దాన్ని
కోరుకోవడం లేదని నీకెలా
చెప్పేది
కన్నీటి తడి
స్పర్శలేవీ..
శిలాజాన్ని తడపవు కదూ
శిశిర పత్రాలెన్ని
రాల్చినా
మది తరువు చిగురింతల కోసం
తలపు విత్తనాలు జల్లడమే
కాని
వసంతం కోసం ఇప్పుడే ఎదురు చూపులు
లేవన్న నిజం నీకెప్పుడు
తెలుస్తుందో
చెరో రహదారిపై సమాంతరంగా సాగే
ఇద్దరి త్రోవలెప్పుడూ
కలవువుగా నేస్తం
అప్పుడప్పుడూ కాస్త వెనక్కి వెళ్లి
మనవైన కొన్ని అడుగులు
తెచ్చుకొని
దారంటా పరచుకున్నా
ఉదాసీనతలను దాటుకుంటూ
ఎవరి గమ్యం వాళ్ళు
చేరడమే ఇప్పుడిక మిగిలిందని
జిందగీ పరిష్కరించలేని పహేలీగా మారాక
జీవితమంటే ఊపిరి
తీసుకోడమే కాని కొత్త అర్దాలేమీ ఇక పుట్టవన్న
ఈ ఆఖరి సందేశంపై కలిసి చేద్దాం కన్నీటి సంతకమొకటి
అజనభీ బన్ జాయే హమ్
దోనో అంటూ ..
అల్విదా నేస్తం
No comments:
Post a Comment