Thursday, October 27, 2016

శూన్యం

ఎప్పటినుండో 
ఈ శూన్యం 
ఇలా కురుస్తూనే ఉంది 
ఎన్నో పగళ్ళూ
ఎన్నో  రాత్రులు దాటి 
ఇంకా ఇంకా ఎడతెరపి లేకుండా  
కాలాన్ని బద్ధకంగా మార్చేసి
మరీ కురుస్తోంది.

నిశ్శబ్ధపు సరిహద్దుల్లో
మన కలలని
నిర్దాక్షిణ్యంగా
ఎవరో నరికి వేసినప్పుడు
మొదలైన మహా  శూన్యం . 

అలసటగా
అప్పుడప్పుడూ
కిటికీ తెరచి చూస్తుంటాను 
అద్దాల మధ్య
తేమలా  పేరుకుపోయిన
చెంపల తడిని తుడుస్తూ .

ఎక్కడి నుండో
ఓ ఈదురుగాలిలా 
ఓ అలజడిలా
శిధిలాల మధ్య రాలిన
కలల శకలాలను పేర్చుకుంటూ
ఓ స్వాప్నికుడిలా
మళ్ళీ మళ్ళీ ఎదురవుతావ్
ఎప్పటిలాగే
మళ్ళీ కిటికీ మూసి వేస్తాను

ఓ మహా శూన్యం లో మళ్ళీ తడుస్తూ

No comments:

Post a Comment