Wednesday, October 26, 2016

అన్నపూర్ణ కిచెన్

పాపం   అన్నపూర్ణ  సార్ధక నామదేయురాలు వండడం ..తినడం రెండూ ఇష్టమే. అందులోకి తను చేతి వంట తనకి మహా ఇష్టం. ఇంకా ఏమి ఇష్టం అని ఎవరైనా పొరపాటున అడిగినా ఇంత కన్నా వేరే ఇష్టాలు కూడా ఉంటాయ అని హాస్చర్య పోయేంత ఇష్టం

అలాంటి అన్నపూర్ణ తండ్రి పనిచేసే  ఆఫీసు లోనే పనిచేసే మన పరాకుశమ్  ఇతగాడికీ కాస్త ఫుడ్ పిచ్చే . ఓ పని మీద వాళ్ళింటికి  వెళ్ళినప్పుడు ఆ చేతి  వంట తిని బోల్డు మూర్చ పోయి పెళ్ళంటూ చేసుకుంటే తననే చేసుకుంటా అని పట్టు పట్టి కాస్త బెట్టు చేసి అప్పటికి తన వంట సంగతి మాత్రమె తెలిసి తిండి సంగతి తెలియక  అదే అండి ఆ వంట తను మహా ఇష్టం గా కూడా తింటుంది అన్న  సంగతి తెలియక అరచి గోల పెట్టి  మరీ చేసుకున్నాడు. 

పాపం అక్కడికీ వాళ్ళమ్మ పిల్ల కాస్త మరీ ఎక్కువ బొద్దుగా ఉన్నట్లుందేమో రా అని చెప్పినా . పెళ్ళయ్యాకా ఏ జిమ్ లోనో చేర్పిస్తే సరి ఈ మాత్రం విషయానికి జీవితాంతం ఇంత  కమ్మటి వంట తినడం  మిస్ చేసుకోడం ఎందుకు అని తెగ ఫీల్ అయ్యి .. తనను మిస్ కాకుండా మిస్సెస్ గా తెచ్చేసుకున్నాడు .

అత్తారింటికి  వచ్చిన మరు క్షణం నుండీ మన అన్నపూర్ణ పుట్టింటి నుండీ అపురూపం గా తెచ్చుకున్న ఒక వంద వంట పుస్తకాలు సివిల్స్ కి ప్రిపేర్ అయ్యే బుద్దిమంతు రాలిలా రోజూ ఔపోసన పట్టేస్తుంటే మురిసి పోయాడు అప్పటికే  బాచిలర్ తిండి తినీ తినీ మొహం మొత్తిన పరాకుశమ్ రోజూ తినబోయ్ కొత్త కొత్త వంటలు తలుచుకుంటూ.
పెళ్ళికి ముందు వండడం తినడం మాత్రమె ఇష్టమైన మన అన్నపూర్ణకి కి ఇప్పుడు అదనంగా మరో ఇష్టం కూడా ఇష్టం గా వచ్చి చేరింది. తన వంటలను ఎవరికైనా తినిపించి ఆనక వారిచేత పొగిడించుకొడం కూడా. అపార్ట్ మెంట్ ఏ పూట ఎవరికీ భద్దకం అనిపించినా ఆ పూట అన్నపూర్ణకి నాలుగు పొగడ్తలు ఫీజుగా చెల్లించి ఫుడ్ పట్టికెల్లడం కూడా నేర్చేసుకున్నారు.
పెళ్లి అయిన కొద్ది రోజులకు  కాని తెలియలేదు తన ఇంటి వంట గది ఒక చిన్న కుటీర పరిశ్రమ గా మార బోతోందని. ఆ పరిశ్రమ కు రోజూ కూరగాయలు అవీ ఇవీ తెచ్చే పెట్టె సప్లయర్ గా మారి పోతాడని.  అప్పటికీ కాస్త జ్ఞానోదయం అయ్యి చూసుకుంటే కాని ఏముందీ   రెండు నెలలలోనే తనో 20 కేజీలు అవలీలగా పెరిగి  సెంచరీ దాటి విరాట్ కోహ్లి బాటింగ్ కన్నా స్పీడు గా దూసుకు పోతోందని తెలిసి బావురుమన్నాడు .

తన జీతం లో ముప్పావ్ వంతు వంట ఇంటి కిచెన్ లో ఆవిరి అయిపోతోందన్న విషయం కాస్త ఆలస్యంగా అయిన గ్రహించి దిద్దు బాట్లు చర్యలు మొదలెట్టాడు మనోడు.  ఓ రోజు మన అన్న పూర్నని కూర్చో బెట్టి ఆరోగ్య సమస్యల మీద ఓ దండకం చదివి భయపెట్టి. జిమ్ లో చేరడానికి తనని అతి కష్టం మీద ఒప్పించి . దగ్గరలోనే ఓ మంచి జిమ్ లో చేర్పించే హుమ్మయ్య అనుకునే లోపే .. జిమ్ ఓనర్ ఓ పాతిక వేలు బిల్ చేతిలో పెట్టాడు. మన అన్నపూర్ణ వంట చేసినంత వీజీగా సైకిల్ తొక్కే ప్రయత్నం లో అది కాస్త పూర్తిగా విరగ్గోట్టేసిందని.

అయినా ఇదంతా తినడం వల్లనే కదండీ ..నేను కొన్నాళ్ళు డైటింగ్ చేస్తాను మన దగ్గరలోనే నాచురోపతి డైటింగ్ సెంటర్ లో ఓ నాలుగు నెలలు ఉంటె చాలు .ఫీజు తక్కువే ..వాళ్ళు పెట్టె ఫుడ్ కి మాత్రం చెల్లిస్తే చాలు  భాధ పడుతూ చెప్పిన అన్న పూర్ణ  మాటలు అంతే  చల్లగా  గా మనోడికి తాకేసాయి

ఇదేదో బాగుంది కనీసం ఓ నాలుగు నెలలు తను కిచెన్ వైపు కన్నెత్తి చూడక పొతే భవిషత్తులో వంట అంటే విరక్తి వచ్చే అవకాశాలు ఏమైనా ఉంటాయేమో అని ఆశపడి ఇంకేం ఆలస్యం చేయకుండా చేర్పించేసాడు . ముందుగా మీరేమీ చెల్లించక్కర్లేదు. నాలుగు నెలలు అయ్యాక ఫుడ్ బిల్ కడితే చాలు. 20 kgs తగ్గడం గ్యారంటీ అన్న వాళ్ళ మాటల మీద బోల్డు బరోసాతో .

ఇంతలో నాలుగు నెలలు యిట్టె గడిచాయి. అన్న పూర్ణ ని మెరుపు తీగలా ఊహించేసుకున్న మనోడికి అతి కష్టం మీద పది కేజీలు మాత్రమె తగ్గిన  అన్నపూర్ణ ఎదురొచ్చింది.

పోనీ ఇంకో నాలుగు నెలలు ఉంచితే ఇంకో పది కేజీలు తగ్గుతుందేమో అనుకునే లోపే .. చేతిలో పెట్టిన బిల్లు కేసి చూసి మూర్చ పోయాడు పది కేజీలు పెంచడం అంత ఈజీ కాదు తగ్గించడం అని ..ఆ పది లక్షల బిల్లు చూసి .  తేరుకున్నాకా .. మళ్ళీ ఇంకో సారి మూర్చ పోయాడు. రుచీ పచీ లేని వంట పెడుతున్నారంటూ అక్కడ వంట వాళ్ళని వెంటబడి కాస్త వేధించి వేపుకొని తిని .. వంట గదిలో అడపాదడపా తన పాక శాస్త్ర ప్రావీణ్యం అక్కడా చూపెట్టిందని .. "అమ్మ గారు వంట అద్బుతం గా చేస్తారు అండి మీరు చాల  అదృష్టవంతులు " అంటూ మెలికలు తిరిగుతూ చెప్పిన రిసెప్షనిస్ట్ మాటలతో .

ఆ తర్వాత మనోడు ఎప్పుడూ  అన్నపూర్ణ బరువు తగ్గడం  గురింఛి పెద్దగా ఆలోచించ లేదు కాని  ఏ రోజైన తన వంట మీద తనకు  విరక్తి  రోజు కోసం ఎదురు చూస్తూ ఆ దిశగా రక రకాల ప్రయోగాలు మాత్రం చేస్తూనే ఉన్నాడు. . ఈలోపల మనోడిని ఎవరైనా  వచ్చి  పెళ్లి చూపులకి వెళ్తున్న అంటే మాత్రం ఇదిగో ఇలా ఓ సలహా పడేస్తాడు .


" ఆడపిల్ల అందం అంత ముఖ్యం కాదు. వంట చేయడం అంటే ఏ మాత్రం ఇష్టం  లేని పిల్లను చేసుకో " అని

No comments:

Post a Comment