Thursday, October 27, 2016

కాలం కాన్వాస్


కాలం కాన్వాస్ పై
కొన్ని ఘడియలు పాటు
కలిసి లిఖించుకున్న
కలలు కొన్ని
శరత్కాలపు నీరెండలా
ఎప్పటికీ
చుట్టుకొని వుంటాయి కదూ

నిండా శిశిరాన్ని కప్పుకొని
నైరాశ్యం లో నేనున్నపుడు
వసంతాన్ని పరిచయిస్తూ
నువ్వొచ్చిన క్షణం నాకింకా గుర్తే

బహుశా
శ్వాస పరిమళమింకా
తోట మరవలేదేమో
తోటని తప్పించుకొని
తిరుగుతూనే ఉన్నా
కొన్ని గులాబీలు మాత్రం
నీ కుశలమడుగుతూ
ఆశగా చూస్తుంటాయి

మళ్ళీ నీ రాకకై
ఎదురు చూస్తున్నానని
వాటికెలా చెప్పను
ఇప్పటికిప్పుడు
వర్షం కురిస్తే బాగుండు
తోటంతా నిన్ను నీడగా పరచుకుని
అక్కడే చిటారు కొమ్మన
చినుకై తడిసి పోతాను

నిరీక్షణలో విరహిస్తున్న క్షణాలకు
వెన్నెల గంధమై నిన్నద్దుకుంటాను
అక్కడే తోటలో కమ్మని పాటగా

నిన్ను వింటూ మైమరచి పోతాను

No comments:

Post a Comment