Thursday, October 27, 2016

// ఆకుపచ్చని మనుగడ //

చెట్టంటే
కొమ్మ పొత్తిల మధ్య
ఊయలై ఊపుతూ
పసితానానికి  పాడిన జోలపాట
దోర జామ పళ్ళ కోసం
ఉరకలేసే బాల్యం
కొమ్మల రెక్కలపై
ఆటలాడిన  ఓ జ్ఞాపకం
అవును చెట్టంటే 
కొన్ని కొమ్మలు కొన్ని వేర్లె కాదు
చుట్టూ  వేళ్ళూనుకున్న
కొన్ని ఆకుపచ్చని జ్ఞాపకాలు

చెట్టంటే
గ్రీష్మ తాపాల నుండీ
నీడనిచ్చి సేద తీర్చే హరితఛత్రం
వర్షించే మబ్బు చినుకుల్ని
ఒడిసిపట్టిన చిగురుటాకుల వింజామర
పూల పొదల మద్య
గువ్వల కువ కువలకు
ఆతిధ్యమిస్తూ
పచ్చదనాల తివాచి మీద
ప్రకృతి వేస్తోన్న రంగవల్లి 
అవును చెట్టంటే 
ఊపిరినిచ్చే ప్రాణవాయువే కాదు
తొలకరి మేఘాలకు  దారి చూపి
దాహార్తిని తీర్చే
ఓ ఆకుపచ్చని మనుగడ

ఓ నాగరికుడా
అసలెప్పుడైన ఆలోచించావా
కాంక్రీటు విత్తనాలు జల్లి
భవనాలను మొలిపించగలవేమో
మనిషి ఊపిరిని కాదని  
అసలెప్పుడైన ఊహించావ
నువ్వు నరుకుతోంది
చెట్లని మాత్రమే  కాదని
చెట్టు  చుట్టూ అల్లుకున్న
మనిషి మనుగడని
ఓజోన్ పొరను చీల్చేస్తూ
నీకు నువ్వే నరికేసుకుంటున్న

నీ  అస్తిత్వమని 

No comments:

Post a Comment