Thursday, October 27, 2016

వసంతం వెలిగించే
ఓ  ఋతువు కోసం
ఆ  గూళ్ళన్నీ ఆశతో
ఎదురుచుస్తుంటాయి

సగం కాలిన దేహం లా
బీటలు వారిన  ఆ గోడల నిండా
చెల్లా చెదురైన వలస పక్షుల
చెమరింతల  కధల వ్యధలు

గుబురు పొదరిల్ల మధ్య పావురాళ్ళు
రాజకీయ క్రీనీడలో .పావులై  ఎగిరిపోయాయి
ఇప్పుడా తోటలో ఏ గులాబీ పూయడం లేదు
బహుశా  తోట కన్నీరు పెట్టిందేమో 
అక్కడక్కడా పలకరిస్తూ  మోడువారిన మొక్కలు
భూతల స్వర్గాన్ని వెక్కిరిస్తున్నాయి

ఎప్పుడు మొదలైందో ఈ  రుధిర వర్షం
లోయంతా ఇంకా కురుస్తూనే ఉంది
అలవాటుగా అదే వాటుగా
బహుశా  ఈ వర్షం ఇప్పట్లో ఆగేట్టు లేదు
ఆకాశం నిండా ముసురుకున్న
మత మౌడ్య మేఘాలు
ఇంకా చిక్కబడుతూనే ఉన్నాయి

ఉన్నట్లుండి   కొన్ని బుల్లెట్ల శబ్దాలు
ఓ సుదీర్ఘ నిశబ్ధం లో భయపెడుతూ వినిపిస్తుంటే
ఏరులై పారుతోన్న కన్నీళ్ళతో
లోయ వేడుకుంటోంది
గాయాల్ని కడిగేసే రోజు కోసం
చెల్లా చెదరై ఎగిరిపోయిన

గువ్వ పిట్టలు తిరిగి గూడు చేరే రోజు కోసం 

No comments:

Post a Comment